Produced by Volunteers at Pustakam.net
అగ్నిగుండం
మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
చంద్రం బిల్డింగ్స్, విజయవాడ-520004
ప్రచురణ సంఖ్య : 939
ప్రతుల సంఖ్య : 2000
ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి, 1980
వెల : రూ. 8/-
ముద్రణ:
స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్.
విజయవాడ-520004
పూజ్యమిత్రులు
శ్రీపాద లక్ష్మీనరసింహంగారి
స్మృతికి
జాగ్రత్త పడవలసిన ఘట్టం
ఒక పెద్ద పోలీసు అధికారి ఒక మేధావుల సభలో హైద్రాబాద్‌లో ప్రసంగిస్తూ ప్రజలలో హింసా ప్రవృత్తీ, దౌర్జన్యదృక్పథం పెరిగి పోయిందన్నారు. పోలీసు బలగానికికూడా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పినా, ప్రజలలో ఆ ప్రవృత్తి తీవ్రంకావడంచేతనే పోలీసులలోనూ దాన్ని ప్రతి క్రియారూపంలో చూస్తామనేది ఆయన వాదన సారాంశం.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ వర్గాలు, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న అవినీతి, ప్రజా వ్యతిరేకత, హింసాప్రవృత్తికి ప్రతిక్రియగానే ప్రజలలో దౌర్జన్యకాండమీద మొగ్గుదల ప్రబలుతూంది. ఒక లారీనో బస్సునో తగలపెట్టేరన్నా,ఒక పోలీసు స్టేషను మీద రాళ్ళు విసిరేరన్నా, ఒక ఆఫీసరునో, కళాశాలాధికారినో చెయ్యి చేసుకున్నారన్నా, ప్రత్యర్ధినిఒంటరిగా చిక్కించుకొని పొడిచేశారన్నా చివరికి నక్సలైట్ వుద్యమం చెలరేగిందన్నా ఇది సమాజంలో నోరుగలవాళ్ళూ, అధికారంగలవాళ్ళూ నిర్భయంగా సాగిస్తున్న అన్యాయాలూ, దురంతాల ప్రతిక్రియగా వస్తున్నదేగాని వేరుకాదు. నా 'రధచక్రాలలో' ఒకవాక్యం వుంది: "నిప్పు ముట్టించేవాళ్ళమూ మనమే, చెయ్యి కాలి ఏడ్చేవాళ్ళమూ మనమే"—నని. నిజానికి పాలకవర్గాలుచేస్తున్నదదే.
ఈ నవలలోని ఘటనలన్నీ నేనే అనుభవించినవో, స్వయంగా చూసినవోనే. వానికి నవల రూపం ఇవ్వడంలో వెనక ముందులూ, కొన్నిసర్దుబాట్లూ, తగు మాత్రపు సాగదీయడాలూ వున్నా ఇవన్నీ జరిగినవే. అయితే అవి జరిగినవి 12-13 ఏళ్ళ క్రితం.ఈనాడవి మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి. ఇటీవలి డాక్టర్లు, లెక్చరర్లు, బ్యాంకు ఉద్యోగులు మొదలయిన వారి సమ్మెలుప్రభుత్వ, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి ప్రతిక్రియా రూపమేగాని వేరుకాదు. సాధ్యమైనంతవరకుఒరగ దోసుకుపోయే స్వభావంగల మధ్యతరగతులలోకి కూడా ఈ ఆత్మరక్షణ భావం బలపడిందంటే సామాజిక పరిస్థితులు ఎంతక్షీణిస్తున్నాయో అర్థం చేసుకోగలం.
తెలుగు దేశం నాకో అగ్నిగుండంగా కనిపించింది. ఈవేళ ఆ స్థితి మరింత క్షీణించింది. హింసా, అన్యాయాలను ప్రభుత్వం తన విధానంగామార్చుకొంది.
ఇదో జాగ్రత్త పడవలసిన ఘట్టం.
మహీధర రామమోహనరావు
1-2-1980
అమీర్‌పేట
ఒక మాట
1967 జూన్‌లో ప్రభుత్వపు రిట్రెంచిమెంటు పథకంతో తెనుగు దేశం అట్టుడికి నట్లున్నప్పుడు మిత్రులు కొసరాజుశేషయ్యగారూ నేనూ ఆనాటి పరిస్థితిని యితివృత్తంగా తీసుకొని నవలలు వ్రాయాలనుకున్నాం.
ఆ రోజు మొదలుకొని ఒకటి రెండు నెలలు నేను చూసినవి, వింటున్నవి, అనుభవిస్తున్నవి, చదువుతున్నవి కాగితం మీద పెట్టేను.అలవాటు పడిపోవడంచేత మనకు కనిపించని భయానకమైన సామాజిక విశీర్ణత-గతి వానిలో కనిపించింది.
ఆ ఘటనలకు ఒక కథా రూపం కల్పించి ఆనాడే కాగితం మీద పెట్టేను. కాని, ఆ కథకు ముగింపు ఎలాగో అర్థం కాలేదు. వానినికట్టగట్టి పెట్టెలో పడేశా.
రెండేళ్ళ అనంతరం శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్లు జిల్లాలలో నక్సలైట్ పోరాటాలు, విద్యావంతులలో వ్యాపిస్తున్న నిహిలిస్టుధోరణులు, ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక ధోరణులు, రాజకీయ పార్టీల విచ్ఛిన్న స్థితి, నిస్తబ్ధస్థితినుంచి బయటపడటానికి కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న కృషి చూసేక, నా నవలకు ముగింపు అర్థం అయిందనిపించింది.
ఒకటి రెండు మార్పులూ, చేర్పులూ, చివరన రెండు మూడు ప్రకరణాల జోడింపుతో నవల పూర్తి అయింది.
అదే 'అగ్నిగుండం' అదో అగ్నిగుండం. మీ ముందుంది.
-రచయిత
24-12-71
మద్రాసు
<